24 June, 2026 | 4:13 PM

జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి

24-06-2026 02:59 PM

బిజినేపల్లి: వార్తలు రాసినందుకు జర్నలిస్ట్ ప్రకాష్‌పై దాడి చేయడం సరైనది కాదని బిజినేపల్లి మండల విలేఖరులు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మండల తహశీల్దారు ఎం.డి. మున్నీరుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం పాలెం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీ తాగుతున్న సమయంలో ప్రకాష్‌పై కొందరు వ్యక్తులు ఒక మహిళ చేత కావాలనే దాడి చేయించారని  ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి మరింత అవమాన పరిచేందుకు యత్నించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విలేఖరులపై దాడులు చేయడం అనుచితమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలేఖరులు కరిగళ్ల సుదర్శన్, నరసింహ, మహేష్, పృథ్వీరాజ్, కిషోర్, రవి, మాసయ్య, శ్రవణ్, మధు తదితరులు పాల్గొన్నారు.