27 April, 2026 | 9:31 AM

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

27-04-2026 01:12 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 

ఆమనగల్లు, ఏప్రిల్ 26(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీశైలం వెళ్తున్న క్రమంలో ఆమనగల్లు పట్టణంలో ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక చారిత్రాత్మక అడుగు అని, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) వల్ల పెరిగిన రద్దీ దృష్ట్యా అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజ్ఞప్తి మేరకు కల్వకుర్తి డిపోకు అదనంగా 20 కొత్త బస్సులను కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

వినతులు..

టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మైసిగండి మైసమ్మ దేవాలయం వద్ద ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని మరియు నియోజకవర్గానికి బీసీ సంక్షేమ శాఖ నుండి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, యువజన కాంగ్రెస్ నాయకులు షాబుద్దీన్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.