14 March, 2026 | 6:26 AM

మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే అల్లు సినిమాస్‌ను నిర్మించాం

14-03-2026 01:13 AM

హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించారు. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవం సందర్భంగా ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ గురించి అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించారు.

అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. దీన్ని నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో కట్టిన లగ్జరీ థియేటర్ చూసి నాకూ అలాంటి థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు.

అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. లార్జ్ ఫార్మాట్, కొత్త ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న ఎక్స్‌పీరియెన్స్ ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు.

అందుకే ఎక్కువగా మల్టీప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఈ స్క్రీన్లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీమ్ ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు” అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.