గుర్తుకొస్తున్నాయి.. ఫన్ రైడ్
యంగ్ హీరో విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్‌చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “ఈటీవీ విన్ రెండేళ్లుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మేము ఏడాదికి ఒక హిట్ తీయడానికి కష్టపడుతుంటే సంవత్సరానికి మూడు నాలుగు హిట్లు కొడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి.. ఇలా అన్ని చిత్రాలు గొప్ప విజయాలు సాధించాయి. ఈ విజయాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మంచి ప్రతిభ ఉన్నవారికి ఈటీవీ విన్ గొప్ప వేదికగా నిలుస్తోంది. ‘గుర్తుకొస్తున్నాయి’ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
చిత్ర కథానాయకుడు విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా స్పెషల్ డే. నా బర్త్ డే రోజే ‘గుర్తుకొస్తున్నాయి’ గ్లింప్స్ ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మనం చాలా జ్ఞాపకాలు క్రియేట్ చేసుకున్నాం. అవి భవిష్యత్తులో మనకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మొహం మీద నవ్వు వస్తుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. ‘గుర్తుకొస్తున్నాయి’ కూడా జ్ఞాపకాల సమాహారం. ఇది సంతోష్ అండ్ అతని ఫ్రెండ్స్ ఫన్ రైడ్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
డైరెక్టర్ వినోద్ గాలి మాట్లాడుతూ.. “ఇది చాలా మంచి సోల్ ఫుల్ కంటెంట్. మర్చిపోయినవని గుర్తు చేసే సినిమా. ఒక సంఘటన కారణంగా హీరో గతాన్ని మర్చిపోతాడు. కానీ మనం సాధారణంగానే అందరిని మర్చిపోతున్నాం. రోజుకు ఒక ఐదు నిమిషాలైనా మనకు నచ్చిన మనుషులతో మాట్లాడితే చాలు. ఈ ప్రాజెక్టుతో అదే చెప్పాలనుకుంటున్నాం” అని చెప్పారు. నిర్మాత శరత్‌చంద్ర మాట్లాడుతూ.. “మన జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ వుంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏది మిస్ అవుతున్నామనేది ప్రేక్షకులకు గుర్తుకొస్తుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, మూవీ యూనిట్ పాల్గొన్నారు.




