‘శక్తి’తో బీటెక్ చదివే అవకాశం కోల్పోతున్నాం
జీవో నం.97 రద్దు చేయాలని కిట్స్ కళాశాల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన
కోదాడ, ఆగస్టు 21 :’శక్తి’తో బీటెక్ చదివే అవకాశం కోల్పోతున్నాం, జీవో నం.97 రద్దు చేయాలని కిట్స్ కళాశాల పాలిటెక్నిక్ విద్యార్థులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. శక్తి స్కీం పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తమ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని, జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియతో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్లో చేరే లేటరల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు కళాశాల ఎదుట విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులు, సాంకేతిక విద్యానిపుణులతో విస్తృతంగా చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలతో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు వాపోయారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమం లో డిప్లొమా విద్యార్థినులు పాల్గొన్నారు.






