సాగర్ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?
- రాయలసీమకు నీటి తరలింపుపై మౌనం..
- తెలంగాణ రైతులకు మాత్రం నీటి కష్టాలా..?
- అక్కడికి నీళ్లు.. ఇక్కడికి కన్నీళ్లు ఎందుకు..
- హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి
గరిడేపల్లి,(విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులతో సాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై హుజూర్నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గరిడేపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒకవైపు శ్రీశైలం–పోతిరెడ్డిపాడు మార్గం ద్వారా రాయలసీమకు నీటి తరలింపు జరుగుతోందని ఆరోపణలు వస్తున్నా, మరోవైపు తెలంగాణ రైతుల పంటలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక బోర్లు, బావులు ఎండిపోయి రైతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. అక్కడికి నీళ్లు ఇక్కడికి కన్నీళ్లు ఎందుకు అని ప్రశ్నించిన ఆయన, ఎడమ కాలువ కింద ఉన్న తెలంగాణ రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీటి విడుదల ఆలస్యమైతే ఇప్పటికే నాట్లు వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
కాలువకు విడతల వారీగా నీటిని విడుదల చేసి చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీరు, పశువుల నీటి సమస్యలు కూడా కొంతవరకు తీరుతాయని పేర్కొన్నారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కడియం స్వప్న వెంకటరెడ్డి, పెండెం వీరయ్యగౌడ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, పెండెం ధనయగౌడ్, వెంకటరాముడు గౌడ్, అమరగాని వెంకటేశ్వర్లు, ప్రధాని సైదులు శేషిరెడ్డి, రాజ్ మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.






