ఉద్ధవ్‌కు ఎదురుదెబ్బ
- ఆరుగురు తిరుగుబాటు యూబీటీ ఎంపీల విలీనానికి స్పీకర్ ఓంబిర్లా ఆమోదం
- షిండేవర్గం శివసేనలోకి ఆరుగురు ఎంపీలు
- అధికారికంగా స్పీకర్ ప్రకటన
ముంబై, జూలై ౧౮: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు తిరుగుబాటు లోక్‌సభ సభ్యులు భావన గవాలీ, కృపాల్ తుమనే, ప్రతాపరావు జాదవ్, శ్రీరంగ్ బార్ణే, సంజయ్ మాండలిక్, ధైర్యశీల్ మానే శివసేన(షిండే వర్గం)లో విలీనమయ్యేందుకు శనివారం స్పీకర్ ఓంబిర్లా ఆమోద ముద్ర వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విలీనాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పరిణామంతో లోక్‌సభలో శివసేన (షిండేవర్గం) బలం 13 ఎంపీలకు పెరిగింది. తాము ఎంపీలను చేర్చుకున్న విధానం చట్టబద్ధంగా ఉందో లేదోనని స్పీకర్ నిశితంగా పరిశీలించారని, చేరిక రాజ్యాంగబద్ధమని నిర్ణయించే స్పీకర్ విలీనానికి ఆమోద ముద్ర వేశారని షిండే ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారమే విలీనం జరిగిందని స్పష్టం చేశారు.
ఆ షెడ్యూల్ ప్రకారం.. ఒక శాసనసభ లేదా పార్లమెంట్‌లో మూడిం ట రెండు వంతుల మంది సభ్యులు విలీనానికి అంగీకరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడదని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీదే పైచేయి అవుతుందని పేర్కొన్నారు.
ఆరుగురు ఎంపీల చేరికతో తమ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ లభించిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, శివసేన(షిండే వర్గం)లో ఆరుగురు ఎంపీల విలీనాన్ని శివసేన (యూబీటీ) తీవ్రంగా వ్యతిరేకించింది. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.






