3 June, 2026 | 4:58 AM

పాలమూరు ప్రాజెక్టుల సందర్శన

03-06-2026 12:05 AM
  1. రేపు, ఎల్లుండి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల పర్యటన
  2. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి దిశా నిర్దేశం
  3. ఇది చారిత్మాత్మక ఘట్టంగా నిలుస్తుంది
  4. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  
  5. జల సౌధలో సీనియర్ అధికారులతో సన్నాహక సమావేశం

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో రెండురోజులపాటు పర్యటించి, పరిశీలించనున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  తెలిపా రు. ప్రాజెక్టులను తనిఖీ చేసి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉంటారని అన్నారు. పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి పారు దల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే చారిత్రాత్మక ఘట్టంగా ఇది నిలుస్తుందని అభివర్ణించారు.

మంగళవారం హైదరాబాద్ జల సౌధలో సీనియర్ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పర్యటన ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం దిశా నిర్దేశం చేస్తారని, కొత్త నిధులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల పనుల స్థితిని సమీక్షించి, అడ్డంకులను అంచనా వేసి, వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టనున్నట్టు వెల్లడించారు.

ఈ పర్యటన అనంత రం కరువు పీడిత పాలమూరు ప్రాంతంలో నీటి పారుదల సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచి, లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో విధాన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి పారుదల స్వరూపాన్ని మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటన చేపట్టిందని పేర్కొన్నారు. పర్యటన సందర్భంగా కొనసాగుతున్న పనులు, మిగిలి ఉన్న పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై విస్తృతమైన క్షేత్రస్థాయి సమీక్ష చేపట్టేందుకు వీలుగా, ప్రాజెక్టుల తాజా పురోగతి నివేదికలను అందించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

పాలమూరు ప్రాంతంలో ఆచరణ సాధ్యమైన అన్ని సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రతి ప్రాజెక్టు సాగునీటి విస్తరణకు సమర్థవంతంగా దోహదపడేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తి పోతల పథకం, కోయిల్‌సాగర్, భీమా, నెట్టంపాడుతో పాటు ఇతర కీలక నీటి ప్రాజెక్టులపై సవివరమైన ప్రజెంటేషన్లు ఉంటాయని చెప్పారు.

గురువారం సాయంత్రం సోమశిలలో ఒక ప్రధాన ప్రజెంటేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అక్కడ సీనియర్ ఇంజనీర్లు వివిధ ప్రాజెక్టుల స్థితి, సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రికి వివరిస్తారని తెలిపారు. ఈ పర్యటన కోసం రెండు హెలికాప్టర్ల ద్వారా ప్రాజెక్ట్ ప్రాంతాల్లో వైమానిక సర్వేలను చేపడుతారని తెలిపారు. సమీక్షా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.