5 March, 2026 | 3:46 AM

కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి!

05-03-2026 01:53 AM

‘తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ నవ్వులు పూయించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. గత నెల 26న విజయ్ దేవరకొండ మందన్న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా బుధవారం ఉదయం ‘విరోష్’ జోడీ తెలుగు మీడియాను మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. “మా ప్రయాణంలో మీరు (మీడియా) ఓ భాగం. పెళ్లి చేసుకుని జంటగా ఇప్పుడు మీ ముందుకొచ్చాం. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మేం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. మీ ఆశీస్సులు మాకు కావాలి” అని కోరారు. ‘మేం కలిసి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించామ’ని రష్మిక తెలిపారు. 

రిసెప్షన్‌కు ప్రముఖుల హాజరు 

‘విరోష్’ జంట వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక సందర్భంగా హైదరాబాద్‌లో సందడి నెలకొంది. బుధవారం సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటుచేసిన ఈ వేడుకలో సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరై,కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి, ఆశీర్వదించారు. సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి రాజకీయ నాయకులు ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, వెంకటేశ్, అక్కినేని నాగార్జున దంపతులు, నాగచైతన్య, రామ్‌చరణ్ దంపతులు, నాని కుటుంబం, అల్లు అర్జున్, రవితేజ, నవీన్ పొలిశెట్టి, రిషబ్ శెట్టి, దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజుల కుటుంబాలు, దర్శకులు శేఖర్ కమ్ముల, నాగ్ అశ్విన్, బోయపాటి, నటి నమత్రా శిరోద్కర్, ఆమె కుమార్తె సితార, రాధికా శరత్‌కుమార్ దంపతులు, ఊహ దంపతులు, బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ తదితరులు సందడి చేశారు.