2 June, 2026 | 10:36 AM

రహదారుల నిర్మాణంతో పల్లెలు అభివృద్ధి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

02-06-2026 09:30 AM

సుమారు 8 కోట్లతో బీటీ రోడ్లు పూర్తి 

రానున్న కాలంలో మరిన్ని రహదారుల నిర్మాణం

గరిడేపల్లి ,(విజయక్రాంతి): పటిష్టమైన రహదారుల నిర్మాణంతోనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు గ్రామంలో సోమవారం రాత్రి ఏడు కోట్ల 70 లక్షలతో  నిర్మించిన వివిధ రహదారుల ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే లింక్ రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్తం అన్నారు. నియోజకవర్గంలో లింకు రోడ్లకు ప్రధాన రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

గరిడేపల్లి మండలంలో 7 కోట్ల 70 లక్షలతో కల్మలచెరువు నుంచి బొత్తలపాలెం, కల్మలచెరువు నుంచి చెవ్వారిగూడెం మీదుగా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల వరకు పూర్తయిన బీటీ రోడ్లను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ రహదారులన్నీ గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నిర్మించడం పట్ల ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. మరో రెండున్నర సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రానున్న కాలంలో మరిన్ని రహదారులు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

పల్లెలకు సరైన రహదారి ఉంటే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పల్లెకు ఉన్న లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరే కృష్ణారెడ్డి, బచ్చలకూరి కృష్ణ, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండు రామాంజిగౌడ్, జుట్టుకొండ సత్యనారాయణ, కల్మలచెరువు గ్రామ సర్పంచ్ బచ్చలకూరి శ్రీను, తాసిల్దార్ స్రవంతి, ఆర్ ఐ ప్రవీణ్, పి ఆర్ ఏ ఈ కళ్యాణ్, హుజూర్నగర్ సిఐ చరమందరాజు, గరిడేపల్లి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ కల్మలచెరువు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.