27 August, 2026 | 4:26 AM

నేడు అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు

27-08-2026 02:21 AM

ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను సరిచూసుకోవాలి 

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సభల్లో సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలిపారు.

అర్హులైన పౌరులు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు నమూనా6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం నమూనా7, వివరాల సవరణ కోసం నమూనా8ను వినియోగించుకోవాలని సూచించారు. ఆచూకీ లేని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, మరణించిన, రెండు చోట్ల నమోదైన ఓటర్ల జాబితాలను కూడా గ్రామ, వార్డు సభల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అందులో ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే తగిన ఆధారాలతో సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ జాబితాలతో పాటు అసంగత వివరాలు ఉన్న, గత ఓటరు జాబితాతో అనుసంధానం కాని ఓటర్ల వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించనున్నట్లు వెల్లడించారు. అసంగత వివరాలు ఉన్న, గత ఓటరు జాబితాతో అనుసంధానం కాని ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి ద్వారా ఓటరుకు లేదా వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేస్తారని పేర్కొన్నారు.

నోటీసులో తెలిపిన తేదీ, సమయం, ప్రదేశంలో ఓటరు స్వయంగా విచారణకు హాజరై అవసరమైన అసలు ధ్రువపత్రాలను చూపించాలని సూచించారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు సమీప గ్రామ పంచాయతీ భవనం లేదా వార్డు కార్యాలయంలో విచారణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల నమోదు అధికారి లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారి ఎదుట హాజరై ధ్రువపత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల సేవల అంతర్జాల వేదిక ద్వారా కూడా సంబంధిత పత్రాలను ముందుగానే జతచేయవచ్చని తెలిపారు.