16 July, 2026 | 12:35 AM

‘విజ్ఞాన్స్’కు కేంబ్రిడ్జ్ ఎమినెన్స్ అవార్డు

16-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ’కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్’ అందించే అత్యున్నత ‘కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎమినెన్స్ అవార్డు (2025--2026)‘ ను కైవసం చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ సోమాజిగూడలోని ’ది పార్క్’ హోటల్‌లో జరిగిన ‘కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ 2026‘ వార్షిక సదస్సులో ఈ అవార్డును, అధికారిక ధృవీకరణ పత్రాన్ని క్యాంపస్ ప్రతినిధులకు అందజేశారు.

‘ఏఐ (కృత్రిమ మేధ) యుగంలో ఇంగ్లీష్ విద్యను సరికొత్తగా మలచడం‘ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించారు. ఈ అవార్డుతో పాటు, ఆగస్టు 2026 నుంచి జూలై 2027 కాలానికి గాను విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ పరీక్షలకు సన్నద్ధం చేసే అధికారిక ’ప్రిపరేషన్ సెంటర్’గా కూడా విజ్ఞాన్స్ యూనివర్సిటీ, హైదరాబాద్ క్యాంపస్ గుర్తింపు పొందింది. తమ క్యాంపస్ ఈ ఘనత సాధించడం పట్ల విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.