అప్రమత్తతే శ్రీరామరక్ష!
- అమాయకులే సైబర్ ముఠాల టార్గెట్
- ఆదమరిస్తే లక్షల్లో నష్టం సోషల్ మీడియా ప్రకటనలను నమ్మొద్దు
- మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి
మహబూబాబాద్, జులై 15 (విజయక్రాంతి): సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తతతోనే ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల అమాయకులను టార్గెట్ గా చేసుకొని సైబర్ నేరాలు పలు చోటు చేసుకున్నాయి. ఆయా సంఘటనల్లో అమాయకులైన బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు.
ఇటీవల జిల్లాలో నమోదైన సైబర్ మోసాలు
మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పెట్టుబడి వ్బుసైట్ ద్వారా 1,50,000 మోసం జరిగింది. నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారిక ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీ ద్వారా 3,50,000 కోల్పోయారు. డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారిక ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీ ద్వారా 1,00,000 నష్టం జరిగింది. కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిగ్రామ్ ట్రేడింగ్/ఇన్వెస్ట్మెంట్ పేరుతో 1,71,000 మోసం చేశారు.
కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలతో బెదిరిస్తూ సెక్స్టార్షన్ ఘటన నమోదైంది. బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ (ఫోన్పే) మోసం ద్వారా 9,879 కోల్పోయారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్వెస్ట్మెంట్ వ్బుసైట్ ద్వారా 49,000 మోసపోయారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో మొత్తం 7 సైబర్ ఫిర్యాదులు నమోదుకాగా, అందులో 6 ఆర్థిక మోసాలు, 1 సెక్స్టార్షన్ కేసు నమోదైంది. మొత్తం 8,29,879 మేర ఆర్థిక నష్టం జరిగినట్లు వెల్లడైంది.
సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు
ఫేస్బుక్ ప్రకటనల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ ఇన్వెస్ట్మెంట్ వ్బుసైట్లలో పెట్టుబడులు పెట్టించడం, టెలిగ్రామ్ ట్రేడింగ్ గ్రూపుల పేరుతో మోసాలకు పాల్పడటం, బ్యాంకు అధికారులు లేదా కంపెనీ ప్రతినిధులమని చెప్పి యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్లను ఆమోదింపజేయడం, బ్యాంకింగ్ వివరాలను సేకరించి అనధికారిక లావాదేవీలు నిర్వహించడం, వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలను నమ్మవద్దు. తెలియని వ్యక్తులు పంపిన యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్లను ఆమోదించవద్దు. ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ, బ్యాంకు పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ, వ్బుసైట్ విశ్వసనీయతను నిర్ధారించుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్లో తెలియని ఇన్వెస్ట్మెంట్ గ్రూపుల్లో చేరవద్దు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బెదిరించినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. బ్యాంకు ఖాతాలకు ట్రాన్సాక్షన్ అలర్ట్లను యాక్టివేట్ చేసుకుని లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించండి. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime. gov.in వ్బుసైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని, వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వృద్ధులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి.
డాక్టర్ శబరీష్, ఎస్పీ, మహబూబాబాద్






