13 May, 2026 | 7:19 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు

13-05-2026 06:24 PM

- డిజిటల్ విద్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యా విధానం,

- ఒకటి నుండి 12వ తరగతి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచితం

- వారానికి మూడు రోజుల పాటు రాగిజావ, మూడు రోజుల పాటు ఉడికించిన కోడిగుడ్లు అందజేయడం

బోధన్,(విజయక్రాంతి): బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచులకు మున్సిపల్ వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం బుధవారం రోజున ఉదయం బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడినట్లు మండల విద్యాధికారి నాగయ్య  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎల్పిఓ  నాగరాజు  మాట్లాడుతూ... ప్రభుత్వ విద్య లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన, జ్ఞానవంతమైన విద్య అందించడమేనని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, డిజిటల్ విద్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యా విధానం, సమాజాభివృద్ధిలో విద్య యొక్క ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన విపులంగా వివరించారు. అనంతరం బోధన్ మండల విద్యాధికారి నాగయ్య  మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ మరియు విద్యా కార్యక్రమాల గురించి వివరించారు. ఒకటి నుండి 12వ తరగతి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, రెండు జతల కుట్టిన యూనిఫార్ములు, మధ్యాహ్న భోజన పథకం, వారానికి మూడు రోజుల పాటు రాగిజావ, మూడు రోజుల పాటు ఉడికించిన కోడిగుడ్లు అందజేయడం జరుగుతోందని తెలిపారు.

అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఏఎల్‌ఎమ్ ల్యాబ్‌లు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎప్,ఎల్,ఎన్ ) కార్యక్రమం, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎల్‌ఈపీ  డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం, విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఏఐ ఆధారిత విద్యా విధానాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత అభ్యసన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని, ప్రతి రెండు నెలలకు ఒకసారి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలల సుందరీకరణ, త్రాగునీటి సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బోధన్ పట్టణ సీఐ  వెంకటనారాయణ  మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పోలీసు శాఖ తరఫున సైబర్ క్రైమ్, బాలల భద్రత మరియు ఇతర సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీడీవో, సాలూరు మండల ఎంపీడీవో, రంజల్ మండల ఎంపీఓలు, బోధన్, ఎడపల్లి, నవీపేట్, సాలూరు మండలాల సీఆర్‌పీలు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.