కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ
30-05-2026 08:59 PM
పాపన్నపేట: మంజీరా ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రాంతం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే పల్లకి సేవ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆలయ పరిసరాలు హోరెత్తాయి. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.






