రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
రౌడీ షీటర్లకు యూరిన్ నార్కోటిక్ పరీక్షలు
గోదావరిఖని లో రౌడీ షీటర్ల కు కౌన్సిలింగ్ లో ఏసీపీ రమేష్ హెచ్చరిక
గోదావరిఖని,(విజయ క్రాంతి): రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్‌లో గోదావరిఖని 1-టౌన్, 2-టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడవడిక కలిగిన వారితో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రౌడీ షీటర్ల నేరచరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ పనులు ముగించుకున్న తరువాత నేరుగా ఇంటికి వెళ్లాలని, అనవసరంగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రౌడీ షీటర్లు ఎలాంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సూచించారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాల్లో పాల్గొంటే చట్టంలోని సంబంధిత యాక్టుల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఏసీపీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా చాలా కాలంగా రౌడీ షీట్ ఓపెన్ అయి ఉండి, గత పది సంవత్సరాలుగా ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా సత్ప్రవర్తనతో ఉన్న వ్యక్తులను గుర్తించి వారి రౌడీ షీట్లను తొలగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సైకియాట్రిస్ట్ డాక్టర్ రవి వర్మ మాట్లాడుతూ, నేరప్రవర్తనకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన జీవితం గడపాలని సూచించారు. కోప నియంత్రణ, మానసిక ఒత్తిడి, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. సమాజంలో మంచి పౌరులుగా మారి ప్రశాంత జీవనం గడపాలని డాక్టర్ రవి వర్మ తెలిపారు.
గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, నేరాల నియంత్రణలో భాగంగా రౌడీ షీటర్లకు యూరిన్ టెస్ట్ ద్వారా నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మత్తు పదార్థాల వినియోగం నిర్ధారణ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా మత్తు పదార్థాల బారిన పడిన వారిని చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైతే డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలోద్దిన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవివర్మ, సబ్‌డివిజన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






