గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్
సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే
మారేడ్‌పల్లి: గురు పౌర్ణమి(Guru Purnima) పర్వదినాన్ని పురస్కరించుకుని మారేడ్‌పల్లిలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ షిర్డీ సాయిబాబా వారిని ఎమ్మెల్యే శ్రీగణేష్(MLA Sri Ganesh) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు ఆలయ కమిటీ చైర్మన్ నాగేంద్ర యాదవ్, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి, సాయిబాబాకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ... గురు పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజని, గురువుల ఆశీస్సులు సమాజానికి, ప్రతి ఒక్కరి అభ్యున్నతికి ఎంతో అవసరమని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని సాయిబాబా వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






