ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2, (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనలతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు.
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి, తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజావాణి లో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.




