ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
సుల్తానాబాద్,(విజయ క్రాంతి):పాఠశాల పిల్లలకు నిర్మాణాత్మకంగా, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అది ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం ఆయన ఊషన్నపల్లి గ్రామ వీధుల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను, సౌకర్యాలను తెలియజేసే ప్లెక్సీ బ్యానర్ తో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 'ప్రభుత్వ పాఠశాలలు ప్రగతికి సోపానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు పిల్లల జీవితాల్లో నింపును వెలుగు' అంటూ గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య గ్రామంలోని హనుమాన్ దేవాలయం చావడి వద్ద గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులను సమావేశపరిచారు.
గ్రామంలోని బడి ఈడు పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని ఆయన కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల కోసం మినరల్ వాటర్ ప్లాంట్, ఫ్రిడ్జ్, ఇంటరాక్టివ్ ప్యానల్ (స్మార్ట్ టీవీ), ప్రతి గదిలో గోడ గడియారాలు, అద్దాలు, ఏర్పాటు చేశామన్నారు. అతి త్వరలోనే కంప్యూటర్లు, సోలార్ విద్యుత్తుతో పాటు కొత్త తరగతి గదుల్లో ఏసీలు, డిస్క్ బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలకు కావలసిన మౌలిక, భౌతిక సౌకర్యాలను కల్పించడమే కాకుండా వారికి ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ విద్యను అందిస్తున్నామని, పాఠశాలకు వరుసగా రెండుసార్లు జిల్లా 'బెస్ట్ ఛాంపియన్ స్కూల్' అవార్డు రావడం దీనికి చక్కని నిదర్శనమన్నారు.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక స్థాయి నుంచి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలో 5గురు, గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో 7గురు, రాష్ట్రస్థాయి తెలుగు పద్యాల పోటీలో ఇద్దరు పిల్లలు అత్యంత ప్రతిభ కనబరిచి విజయం సాధించారన్నారు. పిల్లలకు ప్రతిరోజు పాలు, టిఫిన్ తో పాటు రుచి, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, నూతనంగా 21 వస్తువులతో కూడిన విద్యా సామగ్రి కిట్ ను ప్రతి పిల్లవానికి అందజేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలోప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యతో పాటు గంగారం హైస్కూల్ టీచర్ జి. రవి, ప్రీ ప్రైమరీ పాఠశాల టీచర్, ఆయాలు శ్రీవాణి, స్రవంతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.






