జూన్‌లో వనజీవి రామయ్య స్మారక వనానికి శంకుస్థాపన
మంత్రి పొంగులేటి హామీ... కలెక్టర్‌కు ఆదేశాలు
ఖమ్మం, (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణే శ్వాసగా, కోటి మొక్కలే ప్రాణంగా జీవించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జ్ఞాపకార్థం వచ్చే నెల జూన్ లో స్మారక వనానికి అంకురార్పణ చేయనున్నట్లు తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం క్లస్టర్ పరిధిలో నిర్వహించిన 'ప్రజాదర్బార్'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామయ్య సతీమణి జానమ్మ మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా ఆయన సానుకూలంగా స్పందించారు. రామయ్య సేవలను స్మరించుకుంటూ జూన్‌లో స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేస్తామని, జానమ్మకు ప్రభుత్వ పింఛను అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. స్మారక చిహ్నం కోసం తక్షణమే స్థలాన్ని సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ‘వృక్షోరక్షితి రక్షిత:’ అనే నినాదాన్ని తన జీవితాంతం ఆచరించిన రామయ్య సేవలు చిరస్మరణీయమని, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.






