10 March, 2026 | 10:07 PM

ఆన్లైన్ ద్వారా రైతుల బుకింగ్.. అయినా అవస్థలు

10-03-2026 08:27 PM

*  యూరియా ఇవ్వని ఎఫ్పిసీఎల్ సంస్థ 

* సంఘంలో రూ.11 వందల రుసుము చెల్లించి సభ్యత్వం ఉంటేనే యూరియా 

* నిబంధనలకు విరుద్ధంగా యూరియా బస్తాకు 300 వసూళ్లు

* ఇదేంటనిపై సంస్థ ఇన్చార్జి రమణిని మీడియా ప్రశ్నిస్తే ఎదురుదాడి

అచ్చంపేట: నల్లమల్లలోని రైతన్నలకు యూరియా కష్టాలు తీరడం లేదు. దళారుల నుంచి రైతులను కాపాడుకుందాం అనుకుంటే.. మరో రూపంలో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో  ప్రభుత్వం సూచించిన విధంగా ఆన్లైన్ ద్వారా ఎన్ని బ్యాగులు బుక్ అయితే అన్ని యూరియా బస్తాలు రైతులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో మాత్రం కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీసీఎల్) నాబార్డ్ ఎన్జీవో సంస్థ గత కొంతకాలంగా కొనసాగుతుంది.

నిర్వాహకులు ఇష్టా తీరుగా వ్యవహరించడంతో  రైతులకు  ఇబ్బందులు తప్పడం లేదు.   ఆన్లైన్లో బుక్ చేసుకున్న అన్ని బస్తాలు ఇవ్వలేం దిక్కున చోట చెప్పుకో అని రైతులను బెదిరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. కాగా గత మూడు నెలల క్రితం అమ్రాబాద్ పిఎసిఎస్  లో అక్రమాలు చోటు చేసుకోవడంతో జిల్లా అధికారులు చైర్మన్ ను తొలగిస్తూ వేటు వేసిన విషయం తెలిసిందే. రైతుల క్షేమం కోసం వారికి ఎరువులు మందులు అందించేందుకు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్.. రైతులకు యూరియాను అందించేందుకు ముందుకు వచ్చింది.

అలాగే ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు ఆన్లైన్ ఇతర లేబర్ చార్జీలను కలుపుకొని రూ.270 రైతుల నుంచి వసూలు చేయాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా సంస్థ నిర్వాహకులు ప్రతి బస్తాకు అదనంగా రూ. 30 మొత్తం రూ. 3 వందలు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గోదాములో కాలం చెల్లిన మందులు అలాగే ఉంచడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. 

* సంఘంలో సభ్యత్వం ఉంటేనే యూరియా

ఆన్లైన్ విధానం ద్వారా రైతులు బుక్ చేసుకుంటేనే యూరియా అందుతుందని ప్రభుత్వం చెబుతుంటే ఇక్కడ మాత్రం తమ ఎన్జీవో సంస్థలో  రూ. 11 వందలు చెల్లించి సభ్యత్వం ఉంటేనే రైతుకు యూరియా ఇస్తామని లేకుంటే ఇవ్వమని .. దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. యూరియా కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రైతులకు అవస్థలు పడటం, క్షణాల్లో ఆన్లైన్ బుకింగ్ అయిపోవడం, చాలామంది రైతులకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 

బుక్ చేసుకున్న రైతులకు మాత్రం ఎన్జీవో సంస్థ నిర్వాహకులు భయపెడుతూ రైతులకు చుక్కలు చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. అలాగే మరికొంతమంది సంస్థలో ఉన్న డైరెక్టర్లు, నిర్వాహకులు కుమ్మక్కై యూరియా బస్తాలను బుక్ చేసుకున్న రైతులకు కోతల విధించి పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆ సంస్థలో పనిచేసే అకౌంటెంట్ కూడా రైతులను బెదిరిస్తూ బుక్ చేసుకున్న కూడా రద్దు చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని రైతులు వాపోయారు.

మీడియాపై ఎదురుదాడి దిగిన సంస్థ ఉద్యోగి రమణి..

రైతుల ఫిర్యాదు మేరకు మంగళవారం అమ్రాబాద్ మండల కేంద్రంలో ఉన్న రైతు ఉత్పత్తి దారుల కేంద్రం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో రమణి మీడియా వివరణ కోరగా.. నిర్లక్ష్యంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయించిన ధరకు యూరియాని ఇవ్వకుండా అధికంగా రూ. 30 ఎందుకు వసూలు చేస్తున్నారని అడగగా.. ఆ విషయంలో తనకు సంబంధం లేదని.. దాన్ని డైరెక్టర్లు నిర్ణయించారని దానిని అమలు చేస్తున్నానని తెలిపారు.

రైతులకు ఎన్ని బస్తాలు ఆన్లైన్ ద్వారా బుక్కు అయ్యాయో అన్ని బస్తాలు ఇవ్వడం లేదని ప్రశ్నించగా..  ఒక రైతుకు ఎనిమిది బస్తాలు బుక్ చేసుకుంటే రెండు మూడు బస్తాలను ఇతరులకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ రైతు నేను ఇవ్వలేను అన్ని బస్తాలు నాకే కావాలి అన్నప్పటికీ  అలాంటి రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అడగగా సూటిగా సమాధానం చెప్పలేక ఎదురుదాడికి ప్రయత్నం చేశారు.

ఏవో రమేష్ రెడ్డి స్పందిస్తూ..  ఫర్టిలైజర్ యజమానులు యూరియా కొనుగోళ్లు ముందుకు రాకపోవడంతో..  ఎన్జీవో సంస్థ ముందస్తుగా కొనుగోలు చేస్తుందని వారికి ట్రాన్స్పోర్ట్ లో ఇతర ఖర్చులు ఉంటాయని తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి రైతుకు యూరియా బస్తాలు ఇవ్వాలని, కొందరికి సర్దుబాటు చేసే క్రమంలో అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.