5 May, 2026 | 10:38 AM

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

05-05-2026 09:29 AM

- మంచిర్యాల ఏసీపీ ప్రకాష్

మంచిర్యాల, (విజయక్రాంతి) : ప్రతి వాడలలో, కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇవి దొంగలను గుర్తించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ (MANCHERIAL ACP R. PRAKASH) పేర్కొన్నారు. కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం (COMMUNITY CONTACT PROGRAM) లో భాగంగా మంగళ వారం ఉదయం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో కార్డన్ సెర్చ్ (CORDON SEARCH) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరా (CC CAMERA) ల ఏర్పాటు వల్ల జరిగే మేలు గురించి వివరించారు. అలాగే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ (HELMET), సీటు బెల్ట్ (SEAT BELT) ధరించి వాహనాలను నడపాలని సూచించారు. గంజాయి మత్తుకు బానిసైన కొంత మంది యువకులు తేరుకోవాలని, ఎవరైనా అలా మత్తుకు అలవాటుపడితే తమకు సమాచారం అందిస్తే అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, డీ అడిక్షన్ సెంటర్ ల ద్వారా వైద్యం అందిస్తామన్నారు. తోటి స్నేహితులు, బంధువుల ఎవరైనా ఉంటే వారి భవిష్యత్తు బాగు కోసం మాకు సహకరించాలని కోరారు. ఈ కార్డన్ సెర్చ్ లో వాహనాల ధ్రువీకరణ పత్రాలు (రిజిస్ట్రేషన్ కాగితాలు) లేని, నెంబర్ ప్లేట్లు లేని 58 ద్విచక్ర వాహనాలను, ఎనిమిది ఆటోలను సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.