22 June, 2026 | 4:21 AM

రైతులకు నేరుగా యూరియా అందించాలి

22-06-2026 12:00 AM

ఎస్పీఎం కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్21 (విజయక్రాంతి): ఎంత కష్టపడి పంటను పండించే రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందుల పాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని తనివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ను వెంటనే రద్దుచేసి రైతులకు నేరుగా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. యాప్ ద్వారా రైతులు బుకింగ్ చేస్తే ఎకరానికి రెండు బస్తాలు ఇతర మండలాలలో తీసుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ప్రభుత్వాలు ఎరువులను రైతులకు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. యాప్ ను వెంటనే రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా అందించకపోతే అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డుపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్, పేమెంట్ కూడా సక్రమంగా అందించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులను అమాంతంగా పెంచిందని దీంతో అన్నదాతలపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. దీనికి తోడు యూరియా సక్రమంగా సరఫరా చేయకపోవడంతో వ్యాపారులు ఎరువులకు నానో, ఇతర మందులను లింకులు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఎస్పీఎం కార్మిక సంఘం ఎన్నికల నిర్వహించాలి....

సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. కార్మికులు సంఘం ఎన్నికల కోసం సామరస్యంగా దీక్షలు చేపడితే స్థానిక ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు కనీసం వారి వంక కూడా చూడకుండా ఉండడం సరికాదని హితవు పలికారు. ఎస్ పి ఎం కార్మిక సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు.

కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇప్పించడం లేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే ఎస్ పి ఎం యజమాన్యంతో కుమ్ముక్కు అయ్యారని ఆరోపించారు. కార్మిక సంఘం ఎన్నికల పై ప్రభుత్వం స్పందించకుంటే కార్మికులు ఆందోళనను ఉదృతం చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈనెల 24న లేబర్ కమిషన్ కార్యాలయం కార్మిక సంఘ నాయకులతో కలిసి వెళ్లనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు ముసుగు వేసుకొని దోబూచులు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్మికుల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపేందుకు కూడా వారికి ధైర్యం లేదని పరోక్షంగా విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు కొంగ సత్యనారాయణ, ఓదెలు తదితరులు పాల్గొన్నారు