యూరియా రైతులకు సరిపడా అందించాలి
– పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి: సిపిఎం డిమాండ్
సత్తుపల్లి,(విజయక్రాంతి): రైతులకు అవసరమైన మేర యూరియాను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ కొనసాగించాలని సిపిఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతు ఫర్టిలైజర్ యాప్ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
యాప్‌లో సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ అంతరాయాల కారణంగా రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత విధానంలోనే యూరియా పంపిణీ చేపట్టాలని, రైతులకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉంచి ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






