తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం
జర్నలిస్ట్ కేవీర్‌ను వెంటనే విడుదల చేయాలి: ప్రజా సంఘాల ఐక్యవేదిక
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): హైదరాబాద్‌లో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (డీఎంజేయూ)కు చెందిన జర్నలిస్ట్ కేవీర్ నివాసంలోకి ఏపీ పోలీసులు ప్రవేశించి వ్యవహరించిన తీరును తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించారు. యూనిఫాం లేకుండా, మహిళా పోలీసులు లేకుండానే ఇంట్లోకి ప్రవేశించడం, కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు.
తెలంగాణ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చట్టబద్ధ ప్రక్రియను పాటించకుండా ఏపీ పోలీసులు వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని కోరారు. జర్నలిస్ట్ కేవీర్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పత్రికా స్వేచ్ఛను పరిరక్షించి జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కోరింది.






