23 May, 2026 | 10:24 PM

రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి

23-05-2026 09:07 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): రైతులు రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత కుమార్,నాగ అంజలి సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం చివరి రోజైన శనివారం ములకలపల్లి మండలంలోని మొగరాలగుప్ప, మూకమామిడి గ్రామాల్లో సర్పంచ్ కొర్స ఆదిలక్ష్మి అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

అత్యాధునిక వ్యవసాయ పరిశోధనను నేరుగా గ్రామీణ రైతుల కోసం ఆచరణాత్మకంగా,స్థానిక పరిష్కారాలుగా మార్చడంపై దృష్టి సారించి,పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా రైతుల పొలాలకు చేరే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.ఆధునిక సాంకేతికతను నేరుగా పొలాల్లోకి తీసుకురావడమే లక్ష్యమని శాస్త్రవేత్తలు స్వయంగా మీ వద్దకు వచ్చి మీ పంట సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.

కేవలం ఒకే రకాల పంటలపై ఆధారపడకుండా వివిధ లాభదాయకమైన ఆయిల్ పామ్, మిరప, పప్పుధాన్యాలు, అపరాల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ యూరియా వాడకం తగ్గించాలని రైతులు పొలాలలో సేంద్రియ ఎరువులు వాడాలని కోరారు.రసాయన మందులు తగ్గించి సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి పొందాలనిసూచించారు.అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఎల్లప్పుడూ రైతులకు సలహాలు,సూచనలు అందించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు.మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు మాట్లాడుతూ రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాల పంపిణీని మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు.రైతులు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని,లైసెన్స్ డీలర్ దగ్గర విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.