పొలంలో విషాదం: ట్రాక్టర్ టైరు కిందపడి రైతు మృతి
నూతనకల్: వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలో మట్టి తోలుతుండగా జరిగిన ఒక ఘోర ప్రమాదంలో రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన మద్దిరాల మండలం చిన్ననేమీల గ్రామ పరిధిలో జరిగింది.నూతనకల్ మండలం ఎర్రపహడ్ గ్రామానికి చెందిన శీలం మాల్సుర్ (46) అనే రైతుకు చిన్ననేమీల శివారులో వ్యవసాయ భూమి ఉంది.శనివారం ఆయన తన పొలంలో ట్రాక్టర్ ద్వారా మట్టిని తరలించే పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలో అకస్మాత్తుగా అదుపుతప్పి ట్రాక్టర్ పైనుంచి కిందపడిపోయారు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ భారీ టైరు ఆయనపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా నలిగిపోయి, అక్కడికక్కడే కన్నుమూశారు.రైతు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మాల్సుర్ మృతితో ఎర్రపహడ్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






