అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : ఉమ్మడి జిల్లాలో పర్యాటక మరియు మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ నగరం లోని పిల్లల మర్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించబడినట్లు వెల్లడించారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సుమారు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయగా, అందులో భాగంగా రూ.2 .5 కోట్ల వ్యయంతో పలు పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. మయూరి పార్క్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా ట్రెక్కింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్లు, టూరిస్టుల కోసం తాత్కాలిక కాటేజీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఫారెస్ట్ ఏరియా పరిమితులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు జరుగుతాయని ఆయన తెలిపారు.
కురుమూర్తి, మన్నెంకొండ, , పిల్లమర్రి వంటి ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని అన్నారు. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న కృష్ణ పుష్కరాల దృష్ట్యా జిల్లాలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుమారు 150 పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా వాటిని ఆమోదిస్తూ జిల్లాలోని ప్రధాన దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేయాలని సూచించినట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా కార్యరూపంలో పనిచేస్తోందని, గతంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతూ వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా, మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, 1 వ డివిజన్ కార్పొరేటర్ దేవ్లీ మేఘ్యానాయక్, కార్పొరేటర్లు ప్రశాంత్, రమేష్ రెడ్డి, తిరుమల వెంకటేష్, నాయకులు వర్థ రవి, అశ్వాక్, హకీం, కాటం రాజు, డివైఎస్ఓ జె రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






