14 May, 2026 | 2:24 PM

అంబారిపేటలో వెంకటేశ్వర, శివాలయాల పునరుద్ధరణ పనుల ప్రారంభం

14-05-2026 01:19 PM

కామారెడ్డి అర్బన్,మే14,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అంబారిపేట గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం, శివాలయ పునరుద్ధరణ పనులను శనివారం ఘనంగా ప్రారంభించారు. గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు స్వగ్రామంపై ఉన్న అభిమానాన్ని చాటుతూ సొంత నిధులతో ఆలయాల అభివృద్ధికి ముందుకు రావడం గ్రామస్థుల్లో ఆనందాన్ని నింపింది.

సుమారు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పునరుద్ధరణ పనులను డాక్టర్ ప్రభాకర్ రావు మేనకోడలు శ్రీమతి సురభి నిర్మల సత్యంరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ మాట్లాడుతూ గ్రామ దేవాలయాల అభివృద్ధికి డాక్టర్ ప్రభాకర్ రావు చేసిన సహాయం అభినందనీయమన్నారు. స్వగ్రామాన్ని హృదయంలో నిలుపుకొని ఆలయాల పునర్నిర్మాణానికి సహకరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యగౌడ్, గ్రామ పూజారి కృష్ణమాచార్యులు, దేవాదాయ కమిటీ అధ్యక్షుడు నీల గంగాధర్, వార్డు సభ్యుడు ఫిరంగి అశోక్, బిలకుర్తి స్వామి, అశోక్ రావు, దామోదర్ రావు, దొడ్డి నరసయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.