25 February, 2026 | 12:33 AM

చైర్‌పర్సన్‌గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ

24-02-2026 01:10 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 2౩ (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ఆస్తుల వివాదం సాగుతుండగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.

ఈనెల16న మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం, ఛైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక, వారి ప్రమాణస్వీకారం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. అయితే సోమవారం మున్సిపల్ కార్యాలయం లో ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ హాజరు కానున్నారు. అయితే కామారెడ్డి మున్సిపల్  చరిత్రలో ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మొట్టమొదటి సారిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మూడు రోజులుగా పట్టణంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయ ఆవరణలో సభ నిర్వహణకు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర  మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం సభను ఇతర చోట ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. దాంతో సభను సత్య కన్వెన్షన్ హాలుకు మార్చారు.