కుటుంబ కలహాలతో ఇద్దరు సవతుల మృతి
- మొదటి భార్యపై దాడి చేసిన రెండో భార్య
- ఆత్మహత్యకు పాల్పడి రెండో భార్య మృతి
- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
ఆసిఫాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): సవతుల పోరు కాస్త ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగడంతో మొదటి భార్య దాడిలో రెండోభార్య మృతి చెందగా, భయంతో రెండోభార్య కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం సోనాపూర్‌లో చోటు చేసుకుంది. ఆత్రం కన్నుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రాంబాయి, రెండో భార్య సాకృబాయి. ఇద్దరి మధ్య ఎప్పుడూ వాగ్వివాదాలు, పెనుగులాటలు జరుగుతూండేవి. ఈ క్రమంలో రాంబాయి సాకృబాయిపై దాడికి పాల్పడగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు రాంబాయి కోసం వెతికారు.
రాంబాయి ఇల్లు వదిలి గ్రామానికి చివరన ఉన్న పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గంమధ్యలోనే మృతి చెందింది. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






