త్వరలో రెండో విడత దుస్తుల పంపిణీ
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రెండో విడతగా యూనిఫామ్ లను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఏపీఎం అజయ్ తెలిపారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్ ల తయారీని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న 49 ప్రభుత్వ పాఠశాలల్లో 2,675 మంది బాల బాలికలకు ఇప్పటికే ఒక్కొక్క జత యూనిఫామ్ ను అందించినట్లు తెలిపారు.
ఈనెల 31వ తేదీ లోపు రెండవ దశ యూనిఫామ్ లను కూడా విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. యూనిఫామ్ తో పాఠశాలల్లో సమానత్వం, విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రభుత్వం యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనిఫామ్ విషయంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
యూనిఫాంలో నాణ్యత, సరఫరా విధానం పట్ల విద్యార్థులు తల్లిదండ్రు లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలను సమయానికి కల్పించడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యాసం పై సానుకూల ప్రభావం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్ణీత గడువులో రెండవ జత యూనిఫామ్ లను విద్యార్థులకు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.






