16 August, 2026 | 8:36 PM

వర్షం వస్తే రాకపోకలు బంద్‌.. ప్రమాదాల అంచున ప్రయాణం

16-08-2026 07:45 PM

కుభీర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కుభీర్ మండలం బెల్గాం తండా సమీపంలోని వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న లో-లెవెల్ వంతెన వర్షపు నీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది కురిసిన భారీ వర్షాలకు వంతెన సమీపంలోని రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికే వాగు ఉధృతంగా ప్రవహించి రహదారిపై నీరు చేరుతుండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించేందుకు సాహసించాల్సి వస్తోంది.

గతంలో వరద ఉధృతికి ఓ ఆటో కొట్టుకుపోయిన ఘటనను గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. ప్రాణనష్టం సంభవించేలోపే అధికారులు మేల్కొని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ మార్గం ద్వారా బెల్గాం తండాతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో వంతెన నిర్మాణం అత్యవసరంగా మారిందని తెలిపారు.

ఇక తాత్కాలిక మరమ్మతులు కాదు.. శాశ్వత పరిష్కారమే కావాలి అని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయడంతో పాటు ఎత్తైన శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని బెల్గాం తండా ప్రజలు డిమాండ్ చేశారు.