పర్యాటకులకు ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
గండిరామారం రిజర్వాయర్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు తప్పని తిప్పలు
జనగామ, ఆగస్టు 26 (విజయక్రాంతి) : జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని గండిరామారం రిజర్వాయర్ ఇటీవల పర్యాటక కేంద్రంగా మారుతోంది. వర్షాలతో జలకళ సంతరించుకోవడంతో వరంగల్, జనగామ, సిద్దిపేట వంటి పక్క జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే రిజర్వాయర్ ప్రధాన గేటు దగ్గరే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పర్యాటకులకు ప్రాణభయంగా మారింది.
పర్యాటకుల ఇబ్బందుల
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ లేదు, కంచె లేకుండా బహిరంగంగా ఉంది. వైర్లు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలు భయంతో వెనుదిరుగుతున్నాయి. వర్షం పడితే కరెంట్ లీకేజీ భయంతో రిజర్వాయ కట్టపైకివెళ్లలేకపోతున్నారు. బుధవారం రోజున హన్మకొండ నుంచి వచ్చిన ఓ కుటుంబం ‘రిజర్వాయర్ చూడటానికి బాగుంది కానీ, గేటు దగ్గరే ఇంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ఉంటే పిల్లలతో ఎలా రావాలి?‘ అని ఆవేదన వ్యక్తం చేసింది.
పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ ఉండటం వల్ల పర్యాటకులు ఇబ్బందికి గురవుతున్నారని స్థానికులు అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ ను సురక్షిత ప్రాంతానికి మార్చాలని లేదా చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పర్యాటకులు, గ్రామస్తులు కోరుతున్నారు.






