calender_icon.png 18 February, 2026 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులకు గ్రామీణాభివృద్ధిపై శిక్షణ

18-02-2026 04:35:40 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం లక్ష్యంగా సర్పంచులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు జిల్లా నుంచి ఐదు గ్రామాల సర్పంచులు హాజరవుతున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఈ తరగతులు జరుగుతున్నాయి.

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల పెంపు, ఆర్థిక స్థితి మెరుగుదల, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

తంగళ్లపల్లి మండలం చింతలఠాణా సర్పంచ్ జి. అనసూయ, చందుర్తి మండలం మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీష, ముస్తాబాద్ మండలం గూడూరు సర్పంచ్ సీహెచ్. సునీత, వేములవాడ అర్బన్ మండలం అనుపురం సర్పంచ్ ఎస్. రాజేశ్వరీ, గంభీరావుపేట మండలం దేశాయిపేట సర్పంచ్ జి. పద్మ సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ శిక్షణ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.