8 July, 2026 | 1:53 AM

బొగతలో పర్యాటక అభివృద్ధి

08-07-2026 12:00 AM
  1. జలపాతాన్ని ఆకర్షణీయమైన తీర్చిదిద్దాలి
  2. ఇందిరా మహిళా శక్తి ఫుడ్ కోర్ట్ ద్వారా సాంప్రదాయ వంటకాలు
  3. కలెక్టర్, ఎస్పీ సమీక్ష 

ములుగు (మహబూబాబాద్) జులై 7 (విజయక్రాంతి): బొగత జలపాతాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని,స్థానిక సాంప్రదాయ వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచే విధంగా ఇందిరా మహిళా శక్తి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో వాజేడు మండలంలోని బొగత జలపాతం అభివృద్ధి, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఇందిరా మహిళా శక్తి ఫుడ్ కోర్ట్ నిర్వహణ, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బొగత జలపాతాన్ని సందర్శించే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.

తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలు, భద్రత, దిశా నిర్దేశక బోర్డులు తదితర అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు స్థానిక సంస్కృతి, సంప్రదాయ ఆహార రుచులను పరిచయం చేసేలా ఇందిరా మహిళా శక్తి ఫుడ్ కోర్ట్ ద్వారా జొన్న రొట్టె, బాంబూ చికెన్, నాటుకోడి, చేపల వంటకాలు, తదితర సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతంలో స్థానిక ప్రత్యేకతను ప్రతిబింబించే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం కల్పిస్తూ, వచ్చే ప్రతి పర్యాటకుడికి నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని బొగత జలపాతాన్ని రాష్ట్ర స్థాయిలో ఆదర్శ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డి ఎఫ్ ఓ వికాస్ మీనా, టూరిజం అధికారి శివాజీ, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.