24 February, 2026 | 6:04 PM

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

24-02-2026 03:59 PM

హైదరాబాద్: ఆపరేషన్ కగార్(Operation Kagar)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరితిరుపతి, మల్లారాజిరెడ్డి, చుక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నర్సింహారెడ్డితో పాటు మరో 15 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP) ఎదుట లొంగిపోయారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. తిప్పిరి తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి. కోరుట్లలో ప్రాథమిక విద్య, కరీంనగర్ లో ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్ చదివేటప్పుడు విప్లవ రాజకీయాల పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. కరీంనగర్, కోరుట్ల ఆర్ఎస్ యూ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో జగిత్యాల జైత్రయాత్రతో తిరుపతి ఆకర్షితుడయ్యారు.

1982లో సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్(CPIML People's War) లో తిరుపతి చేరాడు. 1984 లో గణపతి సూచనలతో మల్లారాజిరెడ్డి, తిరుపతి దండకారణ్యానికి వెళ్లారు. మహారాష్ట్ర దండకారణ్యంలో దేవ్ జీ అజ్ఞాత జీవితం గడిపారు. తిరుపతి గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా దేవ్ జీ విధులు నిర్వహించారు. 2001లో సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ పదోన్నతి పొందారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా దేవ్ జీ నియమితుడయ్యారు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ ఛార్జ్ గా దేవ్ జీ బాధ్యతలు చేపట్టారు. మల్లోజుల వేణుగోపాల్ బయటకు వచ్చాక మావోయిస్టు అధికార ప్రతినిధిగా దేవ్ జీ వ్యవహరించారు. పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ ఇన్ ఛార్జ్ గా దేవ్ జీ వ్యవహరిస్తున్నారు.

మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మల్లారాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రపల్లి గ్రామం. మాల్లారాజిరెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యమని డీజీపీ వెల్లడించారు. 1975లో పెళ్లి తర్వాత భార్య రత్నమ్మతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఛత్తీస్ గఢ్ లో 1998లో జరిగిన ఎన్ కౌంటర్ లో రత్నమ్మ చనిపోయారు. మల్లా రాజిరెడ్డి 1974లో ఆర్ఎస్ యూలో చేరారు. కిషన్ జీ మావోయిస్టు సిద్ధాంతాల పట్ల మల్లా రాజిరెడ్డి ఆకర్షితుడయ్యారు. 1980లో సీపీఐఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించాక బొగ్గు గనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారు. 2019 నుంచి మావోయిస్టు పార్టీలో రిక్రూట్ మెంట్ లేదు.. కొందరు రిక్రూట్ అయినా బయటకి వచ్చేశారు, మిగిలిన వారు కూడా లొంగిపోయారని డీజీపీ పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీకి భవిష్యత్తు లేదని డీజీపీ శివధర్ వెల్లడించారు. మావోయిస్టు ఉద్యమం అంతమయ్యిందన్నారు. అనారోగ్యం కారణంగా జనజీవితంలోకి వచ్చినట్లు దేవ్ జీ(Devji) తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని దేవ్ జీ వెల్లడించారు.