25 February, 2026 | 4:34 AM

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

25-02-2026 01:16 AM

జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు, నర్సింహారెడ్డి

తెలంగాణలో నక్సలైట్ వ్యవస్థ నిర్వీర్యం

ఇది రాష్ట్ర పోలీసులకు దక్కిన నైతిక విజయం

గణపతి అడవిలో లేడు.. బయటే తలదాచుకున్నాడు

ఇక మిగిలింది 11 మందే: డీజీపీ శివధర్‌రెడ్డి

నలుగురికి కలిపి రూ.90 లక్షల రివార్డు అందజేత

చట్టబద్ధంగా పోరాడుతా: దేవ్‌జీ

మావోయిజానికి ముగింపు లేదు: మల్లా రాజిరెడ్డి

లొంగిపోయిన అగ్రనేతలు వీరే..

1.దేవ్‌జీ: తిపిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, రమేష్, కుమ్మ దాదా.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 62 ఏళ్ల దేవ్‌జీ మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

2.మల్ల రాజిరెడ్డి: మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లెకు చెందిన 76 ఏళ్ల రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

3.దామోదర్: బడే చొక్కారావు అలియాస్ దామోదర్.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన 47 ఏళ్ల చొక్కారావు.. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది.

4. నూనె నర్సింహారెడ్డి: నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న.. ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన 62 ఏళ్ల నర్సింహారెడ్డి పీఎల్‌జీఏ 1వ బెటాలియన్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది.

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఈ ఏడాది మార్చి 31 నా టికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మా ర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, దండకారణ్యంలో ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో మా వోయిస్టు పార్టీకి నక్సలైట్ల ఉద్యమ శకం ఇక దాదాపు ముగిసినట్లే..! దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ సాయుధ పోరాటాన్ని నడి పించిన మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీలకు చెందిన నలుగురు అగ్రనేతలు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారుల పిలుపు మేరకు వారు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయా రు. లొంగిపోయిన తిపిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ,  మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దా మోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గం గన్న నలుగురి మావోయిస్టులను మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి అధికారికంగా మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో వివరాలను డీజీపీ వెల్లడించారు.

నలుగురు అగ్రనేతల లొంగుబాటుతో మావో యిస్టు సంస్థకు చెందిన చివరి అగ్రనాయకత్వ వ్యవస్థ దాదాపు కూలిపోయిందని తెలి పారు. వీరంతా 28 ఏళ్ల నుంచి 46 ఏళ్ల పా టు అండర్‌గ్రౌండ్‌లో కొనసాగారని అన్నా రు. ఇక తెలంగాణకు చెందిన అండర్‌గ్రౌండ్ కేడర్లు కేవలం 11 మందే మిగిలారని చెప్పా రు. సంస్థలో సిద్ధాంతపరమైన విభేదాలు, నాయకత్వ స్థాయిలో అంతర్గత కలహాలు, భూస్థాయిలో వాస్తవ పరిస్థితులకు సిద్ధాంతాల మధ్య పెరుగుతున్న అంతరం మావో యిస్టు కేడర్లలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని డీజీపీ పేర్కొన్నారు.

ప్రజల మద్దతు కాలక్రమేనా తగ్గిపోవడం, భద్రతాబలగాల నిరంతర గస్తీలతో సంస్థ కదలికలు పరిమితమవడం కూడా ఈ నిర్ణయానికి దోహదప డ్డాయని అన్నారు. ప్రభుత్వ పునరావాస పథకం కింద వారి తలలపై ఉన్న మొత్తం రూ.90 లక్షల రివార్డును డీడీలు, చెక్కుల రూపంలో డీజీపీ వారికి అందజేశారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులు మాత్రం ఇకపై ప్రజా సమస్యలపై చట్టబద్ధం గా పోరాటాలు చేస్తామని, అందుకు సిద్ధమవుతామని వెల్లడించారు.

తెలంగాణలో మొ దలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు చేరుకుందని స్పష్టం చేశా రు. ఈ పరిణామంతో మావోయిస్టుల అ త్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిం దన్నారు. ఇది మావోయిస్టు పార్టీపై తెలంగాణ పోలీసులకు లభించిన నైతిక విజయం గా డీజీపీ అభివర్ణించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూ డా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరని, ఆయన బయట ఎక్కడో సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్న ట్లు తమకు సమాచారం ఉందన్నారు. ప్రస్తు తం జార్ఖండ్‌లో ఉన్న టెక్నికల్ ఇన్‌చార్జ్ పసునూరి నరహరి, ఒడిశా స్టేట్ కమి టీ మెంబర్ ముక్కిడి సాంబయ్య, గణపతి భార్య సుజా త, సుశీల, భగత్ సింగ్ తదితర 11 మంది వెంటనే లొంగిపోవాలని డీజీపీ సూచించారు.

మావోయిస్టుల ఏరివేతలో ఎస్‌ఐబీ రికార్డ్

దశాబ్దాలుగా మావోయిస్టుల కదలికలను పసిగట్టడం, ఆపరేషన్లు నిర్వహించ డం లో తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కీలకపాత్ర పోషించింది. ఎస్‌ఐబీ ఏర్పడిన నాటి నుంచి సోర్స్ బిల్డింగ్, ఇంటెలిజెన్స్ సేకరణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిం ది. ఇప్పటివరకు ఏకంగా 21,232 మంది మావోయిస్టులపై ఎస్‌ఐబీ పక్కా చర్యలు తీసుకుంది. వీరిలో 14,078 మంది క్యాడర్ల అరెస్ట్, 5,865 మంది లొంగుబాటు వెనుక ఎస్‌ఐబీ వ్యూహం ఉంది.

ఇప్పటివరకు 1,057 ఎన్‌కౌంటర్ ఘటనల్లో 1,289 మం ది మావోయిస్టులు మృతి చెందారు. ము ఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి చెందిన 23 మంది కీలక నేతల సమాచార సేకరణలో ఎస్‌ఐబీ దేశంలోనే రికార్డు సష్టించింది. అందులో ఏడుగురు అరెస్ట్ అయ్యా రు. ఏడుగురు లొంగిపోయారు. మరో తొ మ్మిది మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెంద డం గమనార్హం.

రాజకీయాల్లోకి వస్తా.. లీగల్‌గా పోరాడుతా : దేవ్‌జీ

లొంగుబాటు అనంతరం అగ్రనేత దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ..‘నేను రాజకీయాల్లోకి వస్తా ను. ఇకపై ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాటాలు చేస్తాను’ అని స్పష్టం చేశారు. కేవలం అనారోగ్య కారణాల వల్లే తాను అజ్ఞాతం వీడుతున్నానని, వ్యక్తిగత జీవితాన్ని సు ఖంగా గడపడానికి కాదని తెలిపా రు. తన రాజకీయ ప్రస్థానంలో భవిష్యత్‌లో ఎలాంటి అడ్డంకులూ రా వొద్దనే ఉద్దేశంతోనే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పార్టీకి సం బం ధించిన ఇతర రహస్యాలను ఇప్పుడే బయటపెట్టలేనని ఆయన అన్నారు.

మావోయిజం ఎప్పటికీ అంతం కాదు: మల్లా రాజిరెడ్డి

మరో అగ్రనేత మల్లారాజిరెడ్డి మాట్లాడుతూ.. మావోయిజానికి ఎప్పటికీ ముగింపు ఉండదని, ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. ఇన్నేళ్లుగా ఏ సిద్ధాంతాలు, రాజకీయాలు చెబుతూ ప్రజలను సంఘటితం చేశామో.. ఆ అవగాహనను తమలోంచి ఎప్పటికీ తొలగించుకోబోమని కుండబద్ధలు కొట్టారు. తమ నలుగురి లొంగుబాటు ఒకేసారి అనుకుని తీసుకున్న నిర్ణయం కాదని, ఎవరికి వారు వ్యక్తిగత, ఆరోగ్య కారణాల వల్ల వేర్వేరుగా లొంగిపోయామన్నారు. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం మిగతా క్యాడర్‌కు ఏ సందేశం ఇవ్వాలనేది నిర్ణయించుకుని బహిరంగ పరుస్తామని రాజిరెడ్డి వెల్లడించారు.

వనం నుంచి జనంలోకి..!

  1. ముగిసిన దామోదర్ అజ్ఞాతవాసం 
  2. ఇంటర్ చదువుతుండగానే అడవుల్లోకి..

మహబూబాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): అనేక పోలీస్ ఎన్‌కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ కీలకమైన రాష్ట్ర కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు అజ్ఞాతవాసం మంగళవారంతో ముగిసింది.

దామోదర్, దేవ్ జీ సహా మరో నలుగురు అగ్రశ్రేణి మావోయిస్టు నక్సలైట్ నేతలు లొంగిపోయారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా దామోదర్ పేరు తెరపైకి వచ్చేది. అనేక హింసాత్మక సంఘటనల్లో భాగస్వామి అయిన దామోదర్ అనేక పర్యాయాలు చావు నోట్లోంచి బయటపడ్డ సంఘటనలు ఉన్నాయి. కాల్వపల్లిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన దామోదర్ పదో తరగతి ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో పూర్తిచేశారు.

అనంతరం ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే చిన్నాన్న కొడుకు బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకన్న అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కమిటీ నాయకునిగా ఉన్నారు. దీంతో అప్పటికే బయట కార్యకర్తగా పనిచేసిన దామోదర్ ఇంటర్(1997)లోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ ప్రభావంతో అజ్ఞాతంలోకి వెళ్లిన దామోదర్ పీపుల్స్ వార్‌లో దళసభ్యుడిగా చేరి లోకల్ గెరిల్లా స్క్వాడ్ కమాండర్, డిప్యూటీకమాండర్, ఏరియా కమిటీ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు.

అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యుడిగా, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్‌ను పేల్చిన ఘటనలో దామోదర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్‌లో కరోనాతో మరణించారు.

ఆ తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న దామోదర్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీగా పార్టీ నియమించింది. అయితే 2025 జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ మృతి చెందిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఆయన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారని వార్తలు వచ్చాయి.

దామోదర్‌పై ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షలు, తెలంగాణలో రూ.25 లక్షలు రివార్డు ఉంది. దామోదర్ భార్య సబితక్క 2018లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ఆయన సోదరుడు బడే నాగేశ్వరరావు 1999లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఐటీడీఏ మరో సోదరుడు బడే మురళి ఐటీడీఏ టీజర్‌గా పనిచేస్తూ ఉద్యమంలో చేరగా, జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.