13-02-2026 12:48:05 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : తెలంగాణలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు శుక్రవారం వెల్లడి కానుంది. ఉదయం 8 గంటలకు 123 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. రాష్ట్రవ్యాప్తం గా 116 మున్సిపాల్టీల్లో 28 లక్షల 4వేల 274 ఓట్లు, 7 కార్పొరేషన్లలో లక్ష 5 వేల 132 ఓట్లు లెక్కించాల్సి ఉంది.
స్ట్రాంగ్ రూముల్లో 16 వేల 31 బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల వెల్లడికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు లెక్కిస్తారు.
పోలింగ్ కేంద్రం వారీగా 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్‌గా చేసి లెక్కింపు చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్‌కు 40 కట్టలు అంటే వెయ్యి ఓట్లను కౌంటింగ్ టేబుల్‌కు పంపిస్తారు. ఓట్లను ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల వారీగా ట్రేలో వేస్తారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్లను 100 చొప్పున బండిల్ చేస్తారు. రౌండ్లు, టేబుళ్ల వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాలు నమోదుచేసి చివరకి ఫలితాలు ప్రకటించనున్నారు.
వారికి మాత్రమే అనుమతి..
ఓట్ల లెక్కింపు కోసం సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లని రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టంచేసింది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎస్‌ఈసీ, డీజీపీ, కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2 , 582 వార్డుల్లో 13 లక్షల 61 వేల 285 మంది పురుషులు, 14 లక్షల 42 వేల 751 మంది మహిళలు, 238 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు వేశారు.
ఏడు కార్పొరేషన్లలో 4 లక్షల 90 వేల 544 మంది పురుషులు, 5 లక్షల 14 వేల 475 మంది మహిళలు, 113 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును వినియోగించుకున్నా రు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం 12 వేల మంది పోలీసు బలగాలతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహారా కాయనున్నాయి.