calender_icon.png 13 February, 2026 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇరకాటమే!

13-02-2026 12:54:55 AM

  1. విప్ జారీచేసే యోచనలో బీఆర్‌ఎస్ 
  2. ‘మున్సిపల్ ’లో కీలకంగా ఎక్స్‌అఫిషియో ఓట్లు
  3. పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్!

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి మరిం త క్లిష్టంగా మారింది. కాంగ్రెస్ వేదికలపై విస్తృతంగా కనిపిస్తున్న ఈ ప్రజాప్రతినిధులు చట్టపరంగా మాత్రం ఇంకా బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారు.          

ఈ నేపథ్యంలో ఎక్స్-అఫిషియో ఓటు వ్యవహారం వారి రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితిని రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మె ల్యేలు, ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుం ది.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల స్పీకర్ ఇచ్చిన నిర్ణయం ప్రకారం వారు అధికారికంగా బీఆర్‌ఎస్ సభ్యులుగానే గుర్తింపు పొందుతున్నారు. చట్టసభ రికార్డుల్లో పార్టీ మార్పు నమోదు కాలేదని స్పష్టమైంది. 

విప్ గండం..

కాంగ్రెస్ జెండా కింద ప్రచారం చేస్తూనే చట్టపరంగా బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్న ఫిరాయించిన ఎమ్మె ల్యేలు ఇప్పుడు ఒకే ఓటుతో సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. బీఆర్‌ఎస్ విప్ జారీ చేస్తే ఆ విప్ పాటించినా ఇబ్బందే, పాటించకపోయినా అనర్హత వేటు తప్పని పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ అన్న చందంగా మారింది. ఇదిలాఉండగా మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఎక్స్-అఫిషియో ఓటు కీలకంగా మారనుంది.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్ విప్ జారీ చేస్తే దానిని పాటించకపోతే చట్ట ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశముందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు విప్ పాటిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి రావడం వల్ల కొత్త పార్టీలో వారి స్థానం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. 

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌పై ఆసక్తి..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేటీఆర్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎక్స్-అఫిషియో ఓట్ల వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

మున్సిపల్ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నాయకత్వం సూచించినట్టు సమాచారం. ఈ పరిణామం ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడిని పెంచినట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న ఈ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం గులాబీ పార్టీ ప్రతినిధులుగా కొనసాగడం రాజకీయంగా భిన్న పరిస్థితిని సృష్టిస్తోంది.

ఒకవైపు కాంగ్రెస్ ఆశలు, మరోవైపు బీఆర్‌ఎస్ విప్ జారీ చేసే అవకాశం ఉండటంతో ఫిరాయింపుల ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును సంకటంలోకి నెడుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకన్నా, ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికర అంశంగా మారింది. 

ఆ పది మందికి సవాలే..

బీఆర్‌ఎస్ విప్ హెచ్చరిక--- పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. మున్సిపల్ ఎన్నికల రోజున వారు తీసుకునే నిర్ణయం కేవలం స్థానిక సంస్థల ఫలితాలకే కాదు, వారి ఎమ్మెల్యే పదవికీ మలుపు తిప్పే అవకాశముంది. మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నిక రోజు వారు ఏ వైపు నిలబడతారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.

సభ్యత్వాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేస్తారా? లేక విప్‌ను పాటించి బీఆర్‌ఎస్ వైపు నిలబడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారి రాజకీయ భవిష్యత్ కీలక మలుపు తీసుకుంటుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి కేవలం కొందరు ఎమ్మెల్యేల సమస్య కాదు---ఇది దళభ్రష్ట చట్టం అమలు, స్పీకర్ అధికారాల పరిధి, విప్ ప్రభావం వంటి అంశాలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకన్నా, ఈ ఎమ్మెల్యేల నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.