10 August, 2026 | 10:20 AM

రేకుల షెడ్ ధ్వంసం

10-08-2026 08:59 AM

దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు.

బోధన్, ఆగస్టు 09 (విజయక్రాంతి): తన స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్‌ను ధ్వంసం చేసి, తనపై, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సాలుర గ్రామానికి చెందిన ఆలేవర్ ఆనంద్ బోధన్ రూరల్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. సాలుర గ్రామ శివారులోని సర్వే నంబర్ 1962లో 242 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ సేల్ డీడ్ నంబర్ 2252/2023 ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అనుమతులతో స్థలంలో రేకుల షెడ్ నిర్మాణంతో పాటు ఫ్లోరింగ్ టైల్స్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 8న సాలుర గ్రామ సర్పంచ్ భర్త సోలం రవి, ఉప సర్పంచ్ సురేష్ పటేల్, డిస్కో సాయిలు, వార్డు సభ్యులు జాఫర్, కల్లూరి బాసిర్, గైని అరవింద్, బగం శ్రీకాంత్ తదితరులు గుంపుగా వచ్చి తన స్థలంలోకి ప్రవేశించి రేకులు, ఫ్లోరింగ్ టైల్స్‌ను ధ్వంసం చేశారని ఆనంద్ ఆరోపించారు. తనను, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే డిస్కో సాయిలు రూ.లక్ష డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమపై దాడికి పాల్పడ్డారని ఆనంద్ ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. స్థల వివాదానికి సంబంధించి గతంలోనే గ్రామ పంచాయతీకి లీగల్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆనంద్.. ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.