10 August, 2026 | 10:15 AM

శ్రీ కనకదుర్గ పెద్దమ్మతల్లి దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు

10-08-2026 09:12 AM

పాల్వంచ (విజయక్రాంతి): పెద్దమ్మ తల్లి దర్శనానికి(Sri Kanaka Durga Peddamma Thalli Temple) వచ్చే భక్తుల తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని, పాలకమండలి స్పందించి సౌకర్యాలు మెరుగుపరచాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం–కేశవపురం మధ్య వెలసిన ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ పెద్దమ్మతల్లి దేవస్థానంకు అమ్మవారి దర్శనానికి మహిమలను, పిల్లలతో ఇతర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి  అనేకమంది భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడటం, దైవ దర్శనం విషయంలో ఇబ్బందులకు గురిచేయడం, భక్తుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా “మేము ఈ గ్రామానికి చెందినవాళ్లం, మేము లోకల్‌” అంటూ భక్తులపై పెత్తనం చెలాయిస్తూ, “మేము చెబితేనే లోపలికి రావాలి, మేము చెబితేనే బయటకు వెళ్లాలి” అనే విధంగా వ్యవహరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  దేవాలయం అందరికీ సమానమైన భక్తి స్థలం. స్థానికులు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కావచ్చు — ప్రతి ఒక్కరికీ గౌరవంగా, ప్రశాంతంగా, ఎలాంటి వివక్ష లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత దేవస్థానం పాలకమండలి, సంబంధిత అధికారులపై ఉంది. దేవస్థానం ఈవో  కూడా భక్తుల సమస్యలను స్వయంగా పరిశీలించి, దేవాలయ ప్రాంగణంలో ఎవరు పడితే వారు పెత్తనం చేసే పరిస్థితి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠను, భక్తుల విశ్వాసాన్ని కాపాడే విధంగా పాలకమండలి, దేవస్థానం అధికారులు కృషి చేయాలని  భక్తులు కోరుతున్నారు.