calender_icon.png 17 February, 2026 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు

16-02-2026 12:00:00 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామంలోని బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను ఆదివారం జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గ రామ లింగేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న రథోత్స వాన్ని జిల్లా ఎస్పీ సంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.

భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి భక్తుడు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, తాడువాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతాయిపేట భీమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును కూడా జిల్లా ఎస్పీ  పరిశీలించారు.

అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని ఆదేశించారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ  అభినందించారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి, పరస్పర సామరస్యంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని ఎస్పీ  విజ్ఞప్తి చేశారు.