2 May, 2026 | 7:17 PM

Breaking News

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •  

వామ్మో పులి... చిక్కేనా?

18-02-2026 10:48 AM

ఇల్లంతకుంటలో మూడు ఆవులు బలి

అటవీశాఖ గాలింపు చర్యలు ముమ్మరం

ఇల్లంతకుంట,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో గత పదిహేను రోజులుగా పెద్ద పులి సంచారం కొనసాగుతోంది. పశువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. పులి జాడ గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా సోమవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో మూడు ఆవులపై పులి దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయం విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పాదముద్రలు, అవశేషాలను సేకరించి ప్రాథమికంగా పులి దాడిగా నిర్ధారించారు.

 గాలింపు చర్యలు ముమ్మరం

అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి పరిసర గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు అమర్చి గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించనున్నట్లు చెప్పారు. ఇటీవల పులి సంచారం గుర్తించిన ప్రాంతాల్లో గ్రామస్తులకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు.

రైతుల్లో ఆందోళన

పశువులు మృతి చెందడంతో బాధిత రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే పులి పట్టుబడే వరకు భయం తొలగదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

 అప్రమత్తతే మార్గం

అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పులి సంచారం కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో త్వరలోనే పులిని పట్టుకుంటామని తెలిపారు. ఇందులో జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, రేంజ్ ఆఫీసర్లు కల్పన దేవి, కలిమొద్దిన్, సెక్షన్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ ఉన్నారు

పులి కనిపిస్తే తెలపండి : ఎస్సై అశోక్

రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. గ్రామాల్లో గుంపులుగా ఉంటూ లైటింగ్ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. పులి కనిపిస్తే అధికారులు తెలియజేయండి.