15 March, 2026 | 4:04 PM

రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

15-03-2026 01:15 PM

హైదరాబాద్: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన  ఆదివారం చోటు చేసుకుంది. హవేలి ఘనపూర్ మండలం, బురుగుపల్లికి చెందిన శ్రీపతి అమృత గౌడ్, భార్య యాదమ్మ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు గ్రామంలో కల్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.

పెద్ద కుమార్తె వివాహాన్ని అదే మండలంలోని బోగుడభూపతిపూర్‌కు చెందిన గోకాని సాయాగౌడ్‌కు ఇచ్చి చేయగా, రెండవ కుమార్తె భాను వివాహాన్ని కొల్చారం మండలంలోని రంగంపేటకు చెందిన సాయిరామ్ గౌడ్‌తో జరిపించారు. అలాగే తమ ఏకైక కుమారుడు రిషివర్ధన్ గౌడ్‌(14)ను చూసుకుంటు జీవిస్తున్నారు. తమ చిన్న కుమార్తె అయిన భాను ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి అమృత గౌడ్, ఆయన కుమారుడు హాజరై, తిరిగి అల్లుడు  సాయ గౌడ్ తో కలిసి ఇంటికి వస్తుండగా రోడు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. గమనించిన స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రిషి మార్చి 13న తన పుట్టినరోజు జరుపుకున్నాడు, ఆ మరుసటి రోజే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.