22 May, 2026 | 6:25 PM

డంపింగ్ యార్డ్ సమస్య సిఎంకు వివరించి.. పరిష్కారానికి కృషి చేస్తాం!

22-05-2026 05:32 PM

ప్రజల ప్రాణాలను హరించే డంపింగ్ యార్డ్

పదివేల మెట్రిక్ టన్నుల చెత్తను ఒకే చోట డంపు చేయడం విడ్డూరం: ఈటల

ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్, కమిషనర్ వెల్లడి

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డు వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలు వెల్లడించారు. ఈ డంపింగ్ యార్డు వల్ల జవహర్ నగర్ తో పాటు పరిసర ప్రాంతాలైన కీసర, నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ డివిజన్ లలో లక్షలాది మంది ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలపై తాము క్షుణ్ణంగా తెలుసుకున్నామని, అలాగే డంపింగ్ యార్డ్ ను నిర్వహిస్తున్న రాంకి సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

గత కొన్ని నెలలుగా దమ్మాయిగూడ, నాగారం, కీసర ప్రాంతాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు జే ఏ సి గా ఏర్పాటు చేసుకొని దమ్మాయిగూడ చారస్తా వద్ద రిలే నిరాహారా దీక్షలు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే, ఎంపీ లు ఇటీవల ఈ డంపింగ్ యార్డు  వల్ల ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబందులపై ప్రజా ప్రతినిధులు, డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ జే ఏ సి నాయకులు సిఎం దృష్టికి తీసుకెల్లి వినతి పత్రం అందజేశారు. గతంలో డంపింగ్ యార్డుల ఏర్పాటు కోసం సిటీ నలుమూలల ప్రాంతాలలో స్థలాలు తీసుకొని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేయగా ఆ ప్రాంతాల నాయకులు అడ్డుకొని ఆ ప్రాంతాలలో సేకరించిన చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారని సిఎం కు వివరించారు.

స్పందించిన సిఎం డంపింగ్ యార్డు వద్దనే ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజల సమక్షంలో సమావేశం నిర్వహించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. సిఎం ఆదేశాలతో శుక్రవారం ప్రజల సమక్షంలో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో పదివేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రతిరోజు ఒకే దగ్గర వేయడం ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం నుండి చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రామ్ కీ సంస్థ అమలు చేయకపోవడం వల్ల ఈ దుర్భరం నెలకొందని అన్నారు. దీంతో 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెరువు కుంటలన్నీ కలుషితమై నాశనం అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయని, లక్షలాదిమంది ప్రజల ఆరోగ్యం గాలిలో కలిసిపోయిందన్నారు. గర్భిణీలుగా ఉన్న మహిళలకు అబార్షన్లతో సతమతమవుతున్నారన్నారు.  పశుసంపద పూర్తిగా నాశనం అయిందన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మనిషి నివసించని ప్రాంతంగా మారిపోయిందన్నారు. ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ వచ్చినా, వేల కోట్ల రూపాయలు వెచ్చించి అగ్రిమెంట్ చేసుకున్న సంస్థ జీరో డిశ్చార్జ్ ఉంటదని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ ఉండదని చెప్పి దక్కించుకున్న ఈ సంస్థ అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నందున ప్రజల ప్రాణాలను హరించే విధంగా ఈ డంపు యార్డ్ తయారైందని ఆందోళన చెందారు. ఈ విషయాలను మరో మారు సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. 

 మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ... డంపింగ్ యార్డ్ ఒక మోసం... ఒక దగా... అని ఆరోపించారు. రామ్ కీ సంస్థ వారు నరరూప రాక్షసుల కంటే ఎక్కువగా ప్రవర్తించి, ఈ ప్రాంత ప్రజలను చంపేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుండి నేను చూస్తున్నానని, సంస్థ ఒక్కటే ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలుదండుకుంటున్నారన్నారు. అందరినీ మేనేజ్ చేసుకుంటూ వారి పని వారు చేస్తున్నారని, తాను మంత్రిగా ఉన్న రోజుల్లో కంట్రోల్ లో ఉండేదని, రూ. 500 కోట్లతో విద్యుత్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు, రూ. 250 కోట్లతో లిచెడ్  వాటర్ ప్లాంట్ ఏర్పాటు, నూట యాభై నాలుగు కోట్లతో  దుర్వాసన రాకుండా క్యాపింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. కానీ గత మూడేళ్ల నుండి నిర్వహన అస్తవ్యస్తంగా మారిందన్నారు.

 వజ్రష్ యాదవ్(మేడ్చల్ డిసిసి అధ్యక్షులు):

భారతదేశంలో ఎక్కడా లేని సమస్య ఈ డంపింగ్ యార్డ్ వల్ల అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. ఇక్కడి ప్రజలు పశువుల కంటే హీనంగా బతుకుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో చెరువు కుంటలు కలుషితమై పశువులకు నీళ్లు తాగడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ప్రజలు తీవ్ర రోగాలతో బాధపడుతూ వారి శరీరంపై వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయని ఆందోళన చెందారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ను తొలగించి ప్రజల ప్రాణాలను రక్షించాలని సీఎంకు వివరిస్తామన్నారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాము.

సీఎం ఆదేశాలతో దానికి అనుగుణంగా సైటును క్షుణ్ణంగా పరిశీలించి రాంకీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడామని అన్నారు. సైట్ వద్ద ఉన్న సమస్యలను తెలుసుకొని రామ్ కీ సంస్థకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకొని అధికారుల తరఫున సీఎంకు నివేదిక అందజేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, కీసర డిసి వసంత, జేఏసి నాయకులు, మాజీ మేయర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.