15 March, 2026 | 4:05 PM

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

15-03-2026 12:47 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేసింది. ఆదివారం ఎమ్మెల్యే కోవ లక్మీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం పీఆర్‌సీ నివేదికను వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ విడుదల చేస్తున్నప్పటికీ తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. పీఆర్‌సీ కమిటీ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో దాదాపు రూ.8వేల కోట్ల బిల్లులు, సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఆలస్యమవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించి పరిష్కారం సాధించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని టీపీయూఎస్ నాయకులు ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్,వైస్ చైర్మన్ అహ్మద్ , సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే శ్రావణ్ కుమార్, రాష్ట్ర సహధ్యక్షుడు ప్రభోద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సి. హెచ్. వినయ్ కుమార్,అభిలాష్, సాయికిరణ్, వినయ్, సతీష్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.