కేర్‌లో 2 వేల మందికి తిరిగి వినికిడి
విజయవంతమైన స్టేపెడోటమీ సర్జరీలు
డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి నేతృత్వంలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): వినికిడి సమస్య తో బాధపడుతున్న 2వేల మందికి పైగా రోగులు ఇప్పుడు మళ్లీ స్పష్టం గా వినగలుగుతున్నారు. కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో ప్రముఖ ఈఎ న్టీ వైద్యుడు డాక్టర్ ఎన్ విష్ణు స్వరూప్‌రెడ్డి అడ్వాన్స్‌డ్ మైక్రో ఇయర్ సర్జరీ (స్టేపెడోటమీ) ద్వారా ఈ చికిత్సలు విజయవంతంగా చేశారు. సాధారణ కేసుల నుంచి క్లిష్టమైన కేసుల వరకు చికిత్స అందించారు. ముఖ్యంగా ఒటోస్లెరోసిస్ అనే వ్యాధి వల్ల వచ్చే వినికిడి లోపానికి ఇది మంచి పరిష్కారమని వైద్యులు పేర్కొన్నారు. వినికిడి సమస్య ఎక్కువైన తర్వాత లేదా రెండు చెవులూ ప్రభావితమైన తర్వాతే డాక్టర్‌ను సంప్రదిస్తారు.
ఒటోస్లెరోసిస్ అంటే ఏమిటి?
ఇది చెవిలో వచ్చే ఒక సమస్య. మధ్య చెవిలో ఉన్న స్టేప్స్ అనే చిన్న ఎముక గట్టిపడి కదలకుండా అవుతుంది. దాంతో శబ్దం లోపలికి సరిగ్గా వెళ్లదు, వినికిడి నెమ్మదిగా తగ్గుతుంది. ఈ సమస్య చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గర్భధారణ స మయంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్టేప్స్ ఎముకను తీసేసి, దాని స్థానం లో చిన్న కృత్రిమ పరికరం (మైక్రో ప్రోస్థెసిస్) అమర్చుతారు. దీంతో శబ్దం మళ్లీ సరిగా చెవిలోకి చేరుతుంది. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స వెంటనే వినికిడి మెరుగు పడుతుంది. దీని వల్ల హియరింగ్ ఎయిడ్స్ పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. డాక్టర్ రెడ్డి చేసిన తొలి వెయ్యి శస్త్రచికిత్సల వివరాలు 2019లో అంతర్జాతీయ ఈఎన్టీ సదస్సులో ప్రదర్శించబడ్డాయి.
తరువాత 2021లో యూకేలోని ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. ఇవి భారత్‌లో జరిగిన అతిపెద్ద శస్త్రచికిత్సల సిరీస్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఈ గుర్తింపు తర్వాత దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా రోగులు కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. గత ఆరు సంవత్సరాల్లో మరో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి మాట్లాడుతూ చాలా మం ది రోగులు రెండో చెవి కూడా దెబ్బతిన్న తర్వాతే వస్తున్నారు.
ఒటోస్లెరోసిస్ చికిత్స చేయగలిగే వ్యాధి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వినికిడి తిరిగి పొందవచ్చు. చాలా సందర్భాల్లో వినికిడి లోపం శాశ్వతం కాదు. సరైన చికిత్సతో పూర్తిగా సరిచేయవచ్చు, అని అయన తెలిపారు. కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి మాట్లాడుతూ, ముందుగానే పరీక్షలు చేయించుకోవడం, సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల రోగుల జీవితం మెరుగుపడుతుందని చెప్పారు.




