ఆ పలకరింపులు నా కష్టాన్ని దూరం చేశాయి
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న అందాల ఖజానా రాశీఖన్నా. ప్రస్తుతం రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ హిందీలోనూ ఓ భారీ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించబోతోంది. టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను డైరెక్టర్ అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అప్‌డేట్‌ను పంచుకుంది రాశీ ఖన్నా. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ భావోద్వేగభరితమైన నోట్‌ను రాసింది. ‘ప్రతి షూటింగ్ షెడ్యూల్ మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతుందని నేనెప్పుడూ నమ్ముతా. మన చుట్టూ ఉండే మనుషుల నుంచే మనకు నిజమైన బలం వస్తుందని ఈ షెడ్యూల్ నాకు మరోసారి గుర్తుచేసింది. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒంటిపై కొన్ని దెబ్బలు తగిలాయి.
అప్పుడు నా మేనల్లుడి నుంచి వచ్చిన ఒక చిన్న హగ్, కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ నా కష్టాన్ని దూరం చేశాయి. నా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ సెట్స్‌లో ఉన్నవారి ప్రేమాపూర్వక పలకరింపులు నా రోజంతా ఎంతో తేలికగా మారిపోయేది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత నాకు ఆ అలసట ఏమాత్రం గుర్తుకు రావడం లేదు.. కేవలం అందరిపై ఉన్న కృతజ్ఞతాభావమే మిగిలింది. కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా ఇవే జ్ఞాపకాలు నా జీవితాంతం నాతో పాటే ఉండిపోతాయి’ అంటూ రాసుకొచ్చింది రాశీ ఖన్నా.






