ఇది నా లైబ్రరీలో దాచుకునే సినిమా
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ యాక్షన్ -స్పోర్ట్స్ డ్రామా ఇది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో లాంచ్ చేశారు.
ఈ ఈవెంట్‌ల రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం రెండేళ్లుగా ప్రాణం పెట్టి పనిచేశాం. బుచ్చిబాబు అయితే ఐదేళ్లుగా ఈ సినిమాతోనే ప్రయాణిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టుకు నాలుగు పిల్లర్లుంటాయి. కానీ మా ప్రాజెక్టుకు సెంటర్ పిల్లర్ రెహమాన్. రెహమాన్ మ్యూజిక్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ‘పెద్ది’లో భాగం కావడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. జాన్వి చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. తనలో చాలా డెడికేషన్ ఉంది. తన పాత్రను ఎంతో నిజాయితీగా చేసింది.
మా నాన్న, శ్రీదేవి మేడం కలిసి సినిమాలు చేశారు. జాన్వి, నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. ఇది మాకు ఒక పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే సందర్భం. బుచ్చిబాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ ‘సుల్తాన్’, ‘దంగల్’ లాంటి చిత్రాలతో మాకు ఒక స్ఫూర్తినిచ్చారు. వారికి ధన్యవాదాలు. గుర్తింపు కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం, పోరాటమే ఈ సినిమా. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారే వస్తాయి.
‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలు రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన సినిమా. ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు ప్రతిక్షణం ఆస్వాదించాలని నాన్న చెప్పేవారు. ఇది నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా” అన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “బుచ్చిబాబు చాలా రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ). తనకు కావాల్సిన ఔట్‌పుట్ వచ్చేవరకూ వదిలిపెట్టరు. రెహమాన్ మ్యూజిక్ చేసే సినిమాలో నటించడం ఒక గౌరవం.
రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. అమ్మ, చిరంజీవి నటించిన సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. మా కాంబినేషన్ కూడా ప్రేక్షకులు ఎదురుచూశారు. ‘పెద్ది’ నాకు చాలా స్పెషల్ ఫిలిం” అని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్‌చరణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. జాన్వీ తప్పకుండా వాళ్ల అమ్మ స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నా.
రెహమాన్‌తో పనిచేయడం నా డ్రీమ్. రత్నవేలు నా సినిమాకు లైఫ్ ఇచ్చారు” అన్నారు. నిర్మాత సతీశ్ కిలారు మాట్లాడుతూ.. “ముంబై నుంచి ప్రమోషన్స్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక అద్భుతమైన సినిమా. జూన్ 4 నుంచి ఇది మీ సినిమా అవుతుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని చెప్పారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డీవోపీ రత్నవేలు, నటుడు దివ్యేందు శర్మ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






